Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ లో మజ్లిస్ మ్యాజిక్ పనిచేయలేదు!...80 వేల ఓట్లతో సరిపెట్టుకున్న ఒవైసీ బ్రదర్స్

హైదరాబాదు పాతబస్తీ పార్టీ ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి రాష్ట్రం దాటి బయట పోటీ చేసిన ఆ పార్టీ తొలి యత్నంలోనే రెండు మరాఠా ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి పకడ్బందీ వ్యూహం రచించారు. మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో ఒవైసీ సోదరుల ప్లాన్ ఫలించింది. ఆ తర్వాత అక్కడి పలు స్థానిక సంస్థల్లోనూ బరిలోకి దిగిన ఓవైసీలు ఫలితాలను రాబట్టగలిగారు. అయితే మహారాష్ట్రలో అవలంబించిన వ్యూహంతోనే బీహార్ అసెంబ్లీ బరిలోకి దూకిన ఒవైసీ బ్రదర్స్ కు నిన్న షాక్ తగిలింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న సీమాంచల్ లోని ఆరు స్థానాల్లో మజ్లిస్ పోటీ చేసింది. నిన్నటి కౌంటింగ్ సందర్భంగా బైసీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి తొలుత ఆధిక్యంలోకి దూసుకువచ్చినా ఆ తర్వాత మట్టికరిచారు. మొత్తం ఆరు నియోజకవర్గాల పరిధిలో మజ్లిస్ అభ్యర్థులకు కేవలం 80,248 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల నాటికి బీహార్ లో బలపడతామని పేర్కొన్నారు.

More Telugu News